One Nation One Election : జమిలి ఎన్నికలపై సూచనలు ఇవ్వండి.. కానీ ఆ లోపే..

Byline :  Krishna
Update: 2024-01-06 10:20 GMT

జమిలి ఎన్నికల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నీ కుదిరితే ఈ సారి.. లేకపోతే 2029 వరకైనా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని కేంద్రం యోచిస్తునట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం ఓ కమిటీని వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జమిలి ఎన్నికల కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. జనవరి 15లోపు వచ్చే సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గానూ ప్రస్తుత చట్టాల్లో చేయాల్సిన మార్పులకు సంబంధించి సలహాలు ఇవ్వాలని జమిలి ఎన్నికల కమిటీ కోరింది. సలహాలు, సూచనలు పంపేందుకు వెబ్ సైట్తో పాటు మెయిల్ ఐడీని ప్రకటించింది. సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.in లేదా sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలిపింది. ఈ నెల 15 తర్వాత పంపిన సలహాలను పరిగణలోకి తీసుకోమని వివరించింది.

కాగాసెప్టెంబర్ 23న జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ జరిగింది. ఆ సమావేశంలో జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరించడంతో పాటు రాజకీయపార్టీల సూచనలు స్వీకరించాలని డిసైడ్ అయింది. మరోవైపు ఈ సారి జమిలి ఎన్నికలు సాధ్యం కావని లా కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ప్రస్తుత అధికరణలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించలేరని చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని లా కమిషన్ సిఫారసు చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News