శ్రీ కృష్ణుడు ఆలయం నిర్మించే వరకు ఒక్కపూటే భోజనం : మంత్రి
అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారం కావడంతో చాలా మంది ఇన్నాళ్లు చేపట్టిన దీక్షలు విరమించారు. ఇందులో రాజస్ధాన్ మంత్రి మదన్ దిలావర్ ఒకరు. రామ మందిరం నిర్మించేవరకు మెడలో మాల ధరించనని ఏడేళ్ల కిందట చేసిన శపథాన్ని ఆయన వీడారు. ఈ సందర్బంగా మంత్రి మరో దీక్ష చేపట్టారు. శ్రీ కృష్ణుడు జన్మస్థలమైన మథురలో కృష్ణుడు ఆలయం నిర్మించేవరకు ఒక్కపూట భోజనమే చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన మదన్ దిలావర్ అనేక ఏళ్ల క్రితం చేసిన ప్రతిజ్ఞను వీడారు. భారీ మాలను ధరించి దీక్షను విరమించారు. 34కిలోల బరువున్న పూల మాలను బీజేపీ కార్యకర్తలు ముందుగా శ్రీరాముడికి సమర్పించి అనంతరం దీవెనగా మదన్ మెడలో వేశారు. అయితే మదన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రి అయ్యాక కూడా ఎలాంటి పరిస్థితుల్లో మెడలో పూలమాల వేసుకోకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్ దిలావర్ మరో ప్రతిజ్ఞ చేశారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో కృష్ణుడి ఆలయాన్ని నిర్మించే వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజన చేస్తానని తెలిపారు. రామ మందిర నిర్మాణంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంట్లో భోజనం చేసి ఆమెకు చీర, రూ.51వేలు కానుకగా ఇచ్చారు. రామ్ గంజ్ మండిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జరిగిన ర్యాలీలో డ్రమ్ము వాయించారు. మరోవైపు మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన 60ఏళ్ల వృద్ధుడు సైతం తన 32ఏళ్ల దీక్షను విరమించాడు. రామమందిరం నిర్మించేవరకు పాదరక్షలు ధరించనని విలాస్ భావ్సర్ అనే వ్యక్తి 1992లో ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుంచి చెప్పులు వేసుకోకుండా నడిచిన అతడు, తాజాగా అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ పూర్తి కావడం వల్ల దీక్షను విరమించాడు. జలగావ్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్, అతడికి చెప్పుల జతను అందించారు.