కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79)(Oommen Chandy) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన బెంగళూరు లోని చిన్మయ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పరిస్థితి విషమించి ఈ తెల్లవారుజామున 4.25 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమెన్ చాందీ మరణాన్ని ఆయన కుమారుడు సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన తండ్రి ఇక లేరు అని రాశారు. కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే.సుధాకరన్ (Kerala Congress president) కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
1943 అక్టోబర్ 31 న ఊమెన్ చాందీ జన్మించారు. ఆయన స్వస్థలం కొట్టాయం జిల్లా పుతప్పల్లి. మగ్గురు సంతానం. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. కేరళలో ఆయన ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కేరళకు రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. దు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడూ పార్టీ మారలేదు.