బిపర్జాయ్ ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. 35వేల మంది తరలింపు

Update: 2023-06-14 04:04 GMT

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను గురువారం సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం పోర్ బందర్కు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపర్జాయ్ కచ్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావం గుజరాత్‌పై తీవ్రస్థాయిలో ఉండొచ్చని, రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.


అల్లకల్లోలంగా తీర ప్రాంతం

తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో 6 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగసిపడతాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికే తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాలకు చెందిన దాదాపు 35వేల మందికి పైగా జనాలను సహాయక కేంద్రాలకు తరలించించారు. వారికి అవసరమైన నిత్యావసరాలను అందజేశారు.

69 రైళ్లు రద్దు

బిపర్జాయ్ తుఫాను కారణంగా గుజరాత్ లో 69 రైళ్లు రద్దు చేశారు. జూన్ 15 వరకు వాటిని క్యాన్సిల్ చేసినట్లు రైల్వే శాఖ అధికారులు చెప్పారు. వీటితో పాటు మరో 32 ట్రైన్ సర్వీసుల గమ్యస్థానాలను మార్చారు. తుఫాను తీరం దాటే సమయంలో కచ్‌, ద్వారకా, జామ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, మోర్బీతోపాటు నాఘర్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని చెప్పింది. ఆసియా సింహాలకు ఏకైక నివాసమైన గిర్‌ నేషనల్‌ పార్కుతో పాటు సోమనాథ్‌ ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఐఎండీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం

తుఫాను కారణంగా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమైంది. 17 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుఫాను కారణంగా నిరాశ్రయులయ్యే వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టింది. వారికి అవసరమైన నిత్యావసరాలు అందించేందుకు అన్ని సిద్ధం చేసింది. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్తో ఆర్మీ సమన్వయం చేసుకుంటోంది.

ఎగిసిపడుతున్న అలలు

అటు ముంబైలోనూ పరిస్థితి దారుణంగా మారింది. తుఫాను కారణంగా ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. సముద్రం ఉప్పొంగుతుండటంతో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు ప్రతికూల వాతవరణం కారణంగా ముంబై ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ల్యాండయ్యే అవకాశం లేకపోవడంతో కొన్ని సర్వీసులు రద్దు కాగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.












Tags:    

Similar News