Pandit Laxman Bhatt Tailang: విషాదం.. పద్మశ్రీ అందుకోకుండానే ప్రముఖ గాయకుడు మృతి

Update: 2024-02-11 11:34 GMT

ప్రముఖ గాయకుడి మృతితో భారత సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ (93) మరణించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోకుండానే తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పండిట్ తైలాంగ్ మరణ వార్తను ఆయన కుమార్తె ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ ధృవీకరించారు. తైలాంగ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




 


జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలకు కూడా సంగీత పాఠాలు బోధించారు. తన పిల్లలతోపాటు అనేక మందికి వివిధ కళా ప్రక్రియల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దారు. పండిట్ తైలాంగ్‌ బనస్థలి విద్యాపీఠ్‌లో 1950 నంఉచి 1992 వరకు పనిచేశారు. అనంతరం జైపూర్‌లోని రాజస్థాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీత అధ్యాపకుడిగా 1991 నుండి 1994 వరకు కొనసాగారు. 1985లో జైపూర్‌లో ‘రసమంజరి’ పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగా సంగీత విద్యను అందించారు. 2001లో జైపూర్-ధామ్‌లోని ‘అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్’ని స్థాపించి, దానికి డైరెక్టర్‌గా కొనసాగారు. ఈ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మందికి సాయం అందించారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.




Tags:    

Similar News