మోదీనే నా సోదరుడు..రాఖీ పంపిన సీమా హైదర్

Update: 2023-08-23 03:28 GMT

పబ్జీ ఆటతో పరిచయమైన ప్రేమికుడి కోసం పాక్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ కు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‎లో భాగంగా భారత జెండాను ఎగురవేసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసి వార్తల్లో నిలిచింది సీమా. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ లతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు రాఖీలు పంపించి అందరి దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకుంది. దేశ నేతలకు రాఖీలు పంపిస్తున్నట్లు తాజాగా ఓ వీడియోను చేసి నెట్టింట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




 


పాకిస్తాన్ నుంచి భారత్‎కు వచ్చినప్పటి నుంచి సీమా హైదర్ హిందూ పండుగలను ఫాలో అవుతూ వస్తోంది. రీసెంట్‎గా తీజ్, నాగులపంచమి వంటి పండుగలను జరుపుకుంది. అంతకు ముందు ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత్ సర్కార్ నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలోనూ పాలు పంచుకుంది. భారతీయ సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని తన ప్రియుడు సచిన్‎తో కలిసి భారత్‎లోనే ఉంటానని ఈ మధ్యనే తెలిపింది. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు , బీజేపీ , ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకులను రాఖీలు పంపి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా నెట్టింట్లో పోస్ట్ చేసింది.




 


‘‘రాఖీ పండగ నాటికి నా సోదరుల వద్దకు రాఖీలు చేరుకునేందుకు వీలుగా ముందస్తుగానే రాఖీలు పంపుతున్నాను. వారంతా తమ భుజాలపై దేశ బాధ్యతలను మోస్తున్నారు. జై శ్రీరాం, జై హింద్‌, హిందుస్థాన్‌ జిందాబాద్‌’’ అంటున్న సీమా వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పబ్జీ ద్వారా పరిచయమైన భారతీయ ప్రియుడు సచిన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం నోయిడాలో కాపురముంటోంది సీమా. సీమా వ్యవహారంపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలా రాఖీలు పంపుతూ కాకా పడుతోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.




 




Tags:    

Similar News