రాష్ట్రపతి భవన్​పై దాడికి ఐసిస్​ కుట్ర.. !!

పాక్ మహిళకు ఫోటోలు పంపిన బీహార్ వ్యక్తి!;

Byline :  Veerendra Prasad
Update: 2023-09-08 01:45 GMT

జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం సకల ఏర్పాట్లతో సిద్ధమైంది. అగ్రరాజ్యాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు ఈరోజు, రేపు(సెప్టెంబరు 9, 10 తేదీల్లో)జరగబోయే సదస్సుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్​ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు. బిహార్​కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్​కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) డిటెక్టివ్‌లు.. బిహార్​కు వెళ్లి అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన STF​ డిటెక్టివ్​లు.. అనేక చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.




 


ఆ వ్యక్తి కోల్‌కతాకు వచ్చి బాలి వంతెనతో పాటు అక్కడే ఉన్న మరో ఆలయానికి చెందిన ఫోటోలను, అలాగే.. ఢిల్లీ, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన ఫోటోలను పాకిస్థాన్‌లోని ఓ మహిళకు పంపినట్లు డిటెక్టివ్‌లు ఆరోపించారు. ఆ చిత్రాల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​తో పాటు నేషనల్​ వార్​ మెమోరియల్​ చిత్రాలు కూడా ఉన్నట్లు చెప్పారు. సదరు మహిళ.. పాకిస్థాన్​ ఇంటిలిజెన్స్​లో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పలు ముఖ్యమైన ప్రదేశాలను.. ఐసిస్​ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.


Tags:    

Similar News