ప్లాన్ A ఫెయిల్ అయితే ప్లాన్ B.. వెలుగులోకి సంచలన విషయాలు..

Byline :  Krishna
Update: 2023-12-15 12:07 GMT

పార్లమెంటులో ఆందోళన చేపట్టిన ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా.. కీలక నిందితుడైన లలిత్‌ ఝా గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధమున్న రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌, కైలాశ్‌ అనే మరో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా..పోలీసులకు ఓ కీలక విషయం తెలిసింది. పార్లమెంటులో ఆందోళనకు సంబంధించి తమ అసలు ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్ కూడా ముందే సిద్ధం చేసుకున్నట్లు తేలింది.

ప్లాన్‌ ప్రకారం.. నీలం, అమోల్‌లు పార్లమెంటుకు చేరుకొని నిరసన తెలపాలి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే ప్లాన్‌-బి ప్రకారం మహేష్, కైలాష్లు మరో మార్గంలో అక్కడికి వెళ్లి కెమెరాల ముందు ఆందోళన చేయాలని అనుకున్నారు. అయితే గుర్‌గ్రాంలో వీరంతా తలదాచుకున్న విక్కీ ఇంటికి చివరి నిమిషంలో మహేష్, కైలాష్లు చేరుకోలేదు. మహేష్ ను అతడి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అతడు గుర్గ్రాం వెళ్లలేదు. దీంతో నీలమ్‌, అమోల్‌లే ప్లాన్‌ను అమలు చేశారు.

పోలీసుల విచారణలో ఈ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న లలిత్‌ ఝా కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిపేందుకు కొన్ని నెలల నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడు. పార్లమెంటులోకి ప్రవేశించాలంటే ఎంట్రీ పాస్‌ తప్పనిసరి కావడంతో దాన్ని కోసం అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలిసు ముందు ఒప్పుకున్నాడు. అందరి ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకుని.. ఘటన తర్వాత ఆధారాలు దొరకకుండా వాటిని తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 


Tags:    

Similar News