పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. సెలవులు మినహాయించి 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర దక్కేలా చూడాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. వీటిని వర్షాకాల సమావేశాల్లోనే కేంద్రం ప్రవేశపెట్టగా.. పరిశీలన కోసం పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపింది. దీనికి సంబంధించిన రిపోర్టులు హోంమంత్రిత్వ శాఖకు అందగా.. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఈ బిల్లులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.