IndiGo Airlines: ఫ్లైట్ ఆలస్యమైందని సిబ్బందిపై దాడి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-15 04:42 GMT

ఫ్లైట్ ఆలస్యమైందన్న కారణంతో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సిబ్బందిపై దాడికి తెగబడ్డాడో ప్రయాణికుడు. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో కెప్టెన్‌పై దాడికి యత్నంచాడు. కెప్టెన్‌ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను కొందరు ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కేసు నమోదు చేసింది. ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన ఇలా బయటపడింది.




Tags:    

Similar News