విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయగా.. అది విన్న తోటి ప్రయాణికులు భయాందోళలనకు గురై, బయటి పరుగులు తీశారు. ఈ ఘటన కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం కోల్ కతా నుంచి దోహా మీదుగా లండన్ బయలుదేరాల్సి ఉంది. అందులో 541 మంది ప్రయాణిస్తున్నారు. విమానం రన్ వేపై ఉండగా ఓ ప్రయాణికుడు.. విమానంలో బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అది విన్న సిబ్భంది అప్రమత్తమై ప్రయాణికులను విమానం నుంచి కిందికి దింపారు.
సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ స్వాడ్ వచ్చి విమానం అంతా వెతకగా.. ఎలాంటి బాంబు లేదని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత బాంబు అంటూ కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాగా.. తనకు తోటి ప్రయాణికుడు విమానంలో బాంబు ఉందని చెప్పడంతో.. తను అలా అరిచినట్లు తెలిపాడు. తర్వాత అతని తండ్రి వచ్చి.. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని, కొంత కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పాడు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపేందుకు ఆ ప్రయాణికుడిని విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.