RBI bars Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి షాకిచ్చిన ఆర్బీఐ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-31 13:05 GMT

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ Paytm పేమెంట్స్‌ బ్యాంక్‌కి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలను నిలిపేయాలని బుధవారం సంస్థను ఆదేశించింది. నిబంధనలు పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వచ్చే నెలాఖరు తరువాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబోమని తెలిపింది. కస్టమర్ల ఖాతాల్లో జమచేసే ఏవైనా వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్‌లకు మాత్రం అనుమతిస్తామని తెలిపింది.

సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఆ తరువాత ఎక్స్ టర్నల్ ఆడిటర్‌ల ధ్రువీకరణ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ లో పలు అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఈ నివేదిక వెల్లడించిందని తెలిపింది. అందువల్ల పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలపై పర్యవేక్షణ అవసరమని భావించామని తెలిపింది. ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు , వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్ , ఎన్‌సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో ఏవైనా వడ్డీలు, క్యాష్‌బ్యాక్‌లు లేదా ఎప్పుడైనా క్రెడిట్ చేయబడే రీఫండ్‌లు కాకుండా తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబడవని ఆర్బీఐ తెలిపింది. అయితే సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు , నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటితో సహా రుణదాత కస్ట్‌మర్‌ల ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకోవడం లేదా వినియోగించుకోవడం వంటి వాటిపై ఎలాంటి పరిమితులు వుండవని ఆర్‌బీఐ తెలిపింది.

Tags:    

Similar News