Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫ్యూచరేంటి..? కంపెనీ ఫౌండర్ ఏం చెప్పారు..?

Byline :  Kiran
Update: 2024-02-05 11:05 GMT

(Paytm Payments Bank)పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో సంస్థ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు రద్దు చేస్తామని ఆర్బీఐ ప్రకటించలేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లు, లావాదేవీలు తగ్గినా నిబంధనలు అనుసరించి ఆర్బీఐ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తుంది. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి 29 డెడ్ లైన్ ముగిసిన తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుకావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో పేటీఎం ఫౌండర్ విజయ్‌ శేఖర్‌ శర్మ ఉద్యోగులతో భేటీ అయ్యారు. టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ లో దాదాపు 900 మంది ఉద్యోగులతో గంటకుపైగా మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. కంపెనీ భవిష్యత్‌పై ఆందోళన చెందవద్దని, ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని భరోసానివ్వడంతో పాటు కంపెనీలో ఎలాంటి లేఆఫ్లు ఉండవని స్పష్టం చేశారు. మరోవైపు ఆంక్షలు పునర్ సమీక్షించాలని ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శేఖర్ శర్మ చెప్పారు.

ఇదిలా ఉంటే పేమెంట్స్‌ బ్యాంక్‌ అకౌంట్లను ట్రాన్స్ఫర్ చేసేందుకు పేటీఎం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పటికిప్పుడు ఏ బ్యాంకూ సిద్ధంగా లేదని సమాచారం. ఆర్‌బీఐ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చాకే ముందుకెళ్లాలని పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అకౌంట్లు ఇతర బ్యాంకులకు బదిలీ చేసినా.. పేటీఎం యాప్‌లోనే సేవలు కొనసాగనుండగా.. స్పాన్సర్‌ బ్యాంక్‌ మాత్రమే మారుతుంది. పేటీఎం కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఎస్‌బీఐ ప్రకటించింది. 




Tags:    

Similar News