Pegasus : జర్నలిస్టుల ఫోన్లలో పెగసస్.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ప్రకటన

Byline :  Kiran
Update: 2023-12-28 08:01 GMT

పెగాసస్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్‌లో యాపిల్‌ నుంచి హ్యాక్‌ అలర్ట్‌లు వచ్చిన తర్వాత ఇద్దరు ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. ‘ది వైర్‌’ ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజ్‌తో పాటు మరో జర్నలిస్టు ఫోన్లను సెక్యూరిటీ ల్యాబ్‌లో పరీక్షించగా పెగసస్‌ను ఉన్నట్లు తేలిందని స్పష్టం చేసింది.

జర్నలిస్టుల ఇద్దరి ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు అక్టోబర్లో యాపిల్ నుంచి వారికి మెసేజ్ వచ్చింది. దీంతో వారిద్దరూ తమ ఫోన్లను అమ్నెస్టీ ల్యాబ్కు పంపారు. వీరితో పాటు పలువురు ప్రతిపక్ష నేతలకు సైతం హ్యాకింగ్ అలర్ట్లు రావడంపై యాపిల్ వివరణ ఇచ్చింది. 150 దేశాలకు ఇలాంటి సందేశాలు పంపినట్లు చెప్పింది. అయితే అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు మాత్రం ప్రభుత్వమే యాపిల్‌పై ఒత్తిడి తెచ్చి ఇలాంటి మెసేజ్ లు పంపేలా చేసిందని కథనం ప్రచురించింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూపు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్ చేసింది. ఆ కంపెనీ ఈ టెక్నాలజీని వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. ఈ క్రమంలో 2017లో ఇండియన్ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎన్‌ఎస్‌వో నుంచి కొన్ని డివైజ్లు కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తయారుచేసిన ఈ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకుని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు 2021 జులైలో ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇలా దేశంలో దాదాపు 300 మంది ఫోన్లను పెగాసస్‌తో హ్యాక్‌ చేశారంటూ అప్పట్లో ది వైర్‌ కథనం ప్రచురించింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్‌ను కుదిపేసింది.

Tags:    

Similar News