ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవాన్ల రుణం ఏమిచ్చినా తీరదు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ‘మేరీ మాటి మేరా దేశ్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
దేశ రక్షణలో అమరులైన వారిని స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధాని చెప్పారు. వివిధ గ్రామాల్లో స్మారక శిలాఫలకాలను చేస్తామని వివరించారు. ‘‘వారిని తలచుకోవడం మన బాధ్యత. అమృత్ కలశ్ యాత్ర పేరుతో దేశం నలుమూలల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కలను తీసుకొచ్చి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం పక్కనే అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్మారకస్తూపాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ వాటిక ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కు ప్రతీకగా ఉంటుంది..’’ అని మోదీ వివరించారు.
దేశంలో సాగుతున్న విపత్తులపైనా ఆయన మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సాహసంతో కాపాడాయన్నారు. రూ. 12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను ధ్వంసం చేసి కొత్త రికార్డు స్థాపించామని తెలిపారు. ఇటీవలి తన విదేశీ పర్యటన సందర్భంగా 100కుపైగా కళాఖండాలను అమెరికా తిరిగి వెనక్కు తీసుకొచ్చామన్నారు. యూపీలో ఒక్క రోజులో 30 కోట్ల మొక్కలు నాటి రికార్డు నెలకొల్పారని కొనియాడారు. అయితే అల్లర్లతో అట్టుడుకున్న మణిపుర్‌పై మాత్రం ఆయన స్పందించలేదు.