కొన్ని రోజులపాటు అయోధ్యకు వెళ్లకండి.. ప్రధాని మోదీ ఆదేశం
అయోధ్యలో శ్రీరాముడు జనవరి 22న కొలువుదీరాడు. ప్రారంభోత్సవ రోజున పూర్తిగా దేశంలోని ప్రముఖులకే దర్శనానికి అవకాశం కల్పించారు. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో లక్షలాది మంది భక్తులు క్యూలో వేచిచూస్తున్నారు. కొంతమంది ఆలయ ప్రాంగణంలో ఉండగా.. ఇంకొంతమంది బయట నిరీక్షిస్తున్నారు. దీంతో భక్తులను కంట్రోల్ చేయలేక అటు సిబ్బంది, ఇటు పోలీస్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం.. తమ కేబినెట్ లోని మంత్రుల అయోధ్య పర్యటనను మార్చికి పోస్ట్ పోన్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మంత్రులంతా అయోధ్యను సందర్శించడం మానుకోవాలని బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రులను ఆదేశించారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్ట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రాముడి దర్శన వేళలను మార్చింది. ఇకపై ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. అలాగే రానున్న 10 రోజుల పాటు వీఐపీలు అయోధ్యకు రావొద్దని యూపీ ప్రభుత్వం కోరింది.