Mary Millben: 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై అమెరికన్ నటి ప్రశంసలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-04 07:23 GMT

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావించే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అదరగొట్టింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఒక్క తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై ప్రముఖ అమెరికన్‌ నటి, సింగర్‌ మేరీ మిల్బెన్‌ (Mary Millben) స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు.

‘‘నేడు బీజేపీ మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించింది. ఇది ప్రధాని మోదీకి ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. అమెరికా- భారత్‌ సంబంధాలను మరింత మెరుగుపరచగల ఉత్తమ నాయకుడు’’ అంటూ పోస్టు చేశారు. ఇక వీలున్నప్పుడల్లా భారత్‌కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీ అని మేరి మిల్బెన్ ప్రశంసిస్తూనే ఉన్నారు. కొన్నిరోజుల క్రితం కూడా .. అమెరికా - భారత్ బంధానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీకి ఎందుకు మద్ధతిస్తున్నావని, భారత్‌కు సంబంధించిన అంశాలను ఎందుకు తెలుసుకుంటావని తనను చాలా మంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. అలాంటి వారందరికీ ‘ఐ లవ్ ఇండియా’ అనే సమాధానం ఇస్తున్నానని ఆమె చెప్పారు. భారత్‌కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీయేనని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.




Tags:    

Similar News