ఏదో ఒక రోజు దేశాన్ని పాలిస్తాం : సీఎం

By :  Krishna
Update: 2023-11-17 16:15 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీ తమదేనని అన్నారు. ఆప్‌ ఎదుగుతోన్న తీరును చూస్తుంటే.. ఆ రెండు పార్టీలను వెనక్కినెట్టి ఏదో ఒక రోజు దేశాన్నీ పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రతి గడపకూ వెళ్లి బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడంలో భాగంగా తనను జైల్లో వేసేందుకు బీజేపీ ప్లాన్‌ చేసిందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని చెప్పారు. ‘‘ఒకవేళ అరెస్టు అయినా.. నేనే సీఎంగా కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా కోరారు. ఇదే విషయాన్ని ప్రజలనూ అడగండి. ప్రజల నిర్ణయాన్ని బట్టి నా డెసిషన్ ఉంటుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.


Tags:    

Similar News