ఆటంకాలు ఎన్ని ఎదురైనా అభివృద్ధి ఆగలేదు : ప్రధాని మోడీ

By :  Kiran
Update: 2024-02-10 13:07 GMT

బీజేపీ ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అందుకే ప్రతి ఒక్కరూ బీజేపీ పాలనను కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు శనివారం ప్రధాని మోడీ 17వ లోక్ సభలో చివరిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా మార్పు కనిపిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ప్రధాని మోడీ గుర్తు చేశారు. కరోనా సమయంలో బాధితుల కుటుంబాలకు ఎంపీలు తమ జీతాలను అందించిన విషయాన్ని వివరించారు.

భారత్‌లో జీ20 సమావేశాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఆ సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ఖ్యాత మరింత పెరిగిందన్నారు. కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల కాశ్మీర్‌ ప్రాంతం ప్రస్తుతం శాంతంగా ఉందని అన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా దేశంలో అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగలేదన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని, ఏడు దశాబ్దాల పాటు నినాదాలకే ఆ పార్టీలు పరిమితం అయ్యాయన్నారు. తమ ప్రభుత్వం మాత్రం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని వెల్లడించారు. కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 17వ లోక్‌సభలో మోడీ తన చివరి ప్రసంగాన్ని వినిపించారు. మరో 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందన్నారు. 

Tags:    

Similar News