Asian games 2023 : అసాధారణం..అద్భుతం.. మీ కోసం ఎదురుచూస్తున్నా : మోదీ

By :  Krishna
Update: 2023-10-07 06:55 GMT

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్ములేపుతున్నారు. వరుస పతకాలతో తమ సత్తా చాటుతున్నారు. భారత్ ఖాతాలో ఇవాళ మరో మూడు బంగారు పతకాలు సహా ఐదు పతకాలు వచ్చి చేరాయి. తాజా పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ సెంచరీ కొట్టింది. ఇప్పటివరకు 25 గోల్డ్, 35 రజతం, 40 కాంస్య పతకాలను దక్కించుకుంది. ఈ క్రమంలో భారత క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. ‘‘భారత్ సాధించిన పతకాల సంఖ్య 100కి చేరడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన అథ్లెట్లకు నా అభినందనలు. మీ అసాధారణ ప్రతిభ మమ్మల్ని గర్వపడేలా చేస్తోంది. ఈ నెల 10న మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా ఇవాళ భారత్ ఆర్చరీలో రెండు, మహిళల కబడ్డీలో పసిడి పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ పురుషల కాంపౌండ్‌ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్‌ మెడల్‌ సాధించగా.. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇక మహిళల కబడ్డి జట్టు స్వర్ణ పతకంతో దుమ్మురేపింది. అంతేకాకుండా ఆర్చరీలో అభిషేక్ వర్మకు రజతం, అధితి గోపించంద్ కాంస్య పతకాలు సాధించారు.

Tags:    

Similar News