PM Modi: ప్రఖ్యాత విద్యాసంస్థల్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Update: 2024-02-20 09:29 GMT

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐఐఎస్ఈఆర్ ప్రాంగణాలను మంగళవారం ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్‌ ఐటీని జాతికి అంకితమిచ్చారు. . నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతోపాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉన్న విద్యలో ఉన్నత ప్రమాణాలకు ఎన్డీయే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మోదీ చెప్పారు. విద్యార్థులకు ఆధునిక శిక్షణ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడలేదని అన్నారు. 2024 కు ముందు జమ్మూ కశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 12 కాలేజీలకు పెంపు చేశామని, దీని ద్వారా 500 సీట్ల నుంచి 1300 సీట్లకు మెడికల్ సీట్లు పెరిగాయని మోదీ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే.. తప్పనిసరిగా అమలయ్యే గ్యారంటీ అని అన్నారు. "జమ్ము కశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తామని హామీ ఇచ్చాం. హమీకి అనుగుణంగానే ఇవాళ జమ్ము కశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎం ప్రారంభించాం. అధునాతన వసతులతో ఐఐఎంలు, ఐఐటీలు, ఐసర్‌లు నిర్మించాం. పదేళ్లలో రికార్డు స్థాయిలో పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీలు నిర్మించాం" అని ప్రధాని అన్నారు.

కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. నేడు ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు.. వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారంటూ కాంగ్రెస్ నుద్దేశించి వ్యాఖ్యలు చేసిన ప్రధాని.. జమ్ముకశ్మీర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలో వికసిత్‌ కశ్మీర్‌కల సాకారం అవుతుందన్నారు.




Tags:    

Similar News