Aditya-L1 : ఇస్రో మరో ఘనత.. మోదీ ఏమన్నారంటే..?

Byline :  Krishna
Update: 2024-01-06 12:12 GMT

ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం సక్సెస్ అయ్యింది. 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించి తన గమ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత్ మరో మైలురాయిని అందుకుంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన ప్రయోగాలు చేపట్టడంలో భారత శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ ఫీట్‌ని సాధించినందుకు ఇస్రోను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. మానవాళి ప్రయోజనాల కోసం సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలను చేరుకునేందుకు మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఆదిత్య ఎల్ 1 ఐదేళ్ల పాటు తన సేవలను అందించనుంది. సౌర వాతావరణాన్ని పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ నుంచి సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌కు మాత్రమేకాదు యావత్‌ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్‌1 అందించనుంది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం 7పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ వంటి విషయాలపై ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.

Tags:    

Similar News