PM Modi: ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారు.. ప్రతిపక్షాలపై ప్రధాని కామెంట్స్

Byline :  Veerendra Prasad
Update: 2024-02-04 12:16 GMT

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఎవరైతే అధికారంలో ఉన్నారో వారంతా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారన్నారు ప్రధాని మోదీ. ఆ కారణంగానే సొంత సంస్కృతిని చూసి సిగ్గుపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని గువహటిలో రూ.11,600కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అసోంలో ఆవిష్కరించిన ప్రాజెక్టులు ఈశాన్య ప్రాంతంలోనేగాక దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలకూ అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో శాంతి నెలకొందని, 7,000 మందికి పైగా ప్రజలు తమ ఆయుధాలను పక్కన బెట్టి జనజీవనంలోకి తిరిగి వచ్చారని గుర్తు చేశారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, నేడు 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.

పదేళ్లకు ముందు దేశం ఇలా శాంతిగా లేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నవారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పవిత్ర స్థలాలను పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం మన గతాన్ని మరుగున పడేలా వ్యవహరించారు.వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదు. అవి కేవలం సందర్శనీయ స్థలాలు మాత్రమే కాదు. వేల ఏళ్ల మన నాగరికత ప్రయాణానికి చిహ్నాలు. సంక్షోభాలను ఎదుర్కొని దేశం స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది’’ అని ప్రధాని తెలిపారు. ఏ దేశం కూడా తన గతాన్ని చెరిపివేయడం ద్వారా అభివృద్ధి చెందబోదన్నారు ప్రధాని. కానీ గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

Tags:    

Similar News