బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ భేటీ.. తెలంగాణపై సస్పెన్స్

Update: 2023-08-16 08:34 GMT

ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న క్రమంలో... కేంద్రంలోని బీజేపీ సర్కార్‌.. ఇప్పటి నుంచే అభ్యర్థులపై ఫోకస్‌ పెట్టింది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోయే ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఈ భేటీలో చర్చించనున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో పకడ్బందీగా వ్యవహరించాలని కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఇక్కడ విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లలో అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఈరోజు జరిగే సమావేశంలో మాత్రం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులపై పార్టీ హైకమాండ్‌ ఇంకా దృష్టిసారించలేదని సమాచారం. ఇక, ఇటీవలే తెలంగాణలో బీజేపీ చీఫ్‌ను పార్టీ అధిష్టానం మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ఎంపికయ్యారు. అయితే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బీజేపీ లిస్ట్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News