Old Parliament Building : పాత పార్లమెంటు బిల్డింగుకు కొత్త పేరు పెట్టిన మోడీ

Byline :  Kiran
Update: 2023-09-19 07:32 GMT

96 ఏండ్లుగా అనేక చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంటు భవనం కథ ముగిసింది. ఇవాళ్టి నుంచి కొత్త బిల్డింగులో పార్లమెంటు ఉభయసభలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రధాని నరేంద్రమోడీ చివరి సారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పాత భవనంలో జరిగిన అనేక ఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 100ఏండ్ల చరిత్రకు సాక్షిగా నిలిచిన పార్లమెంటు పాత భవనానికి ఆయన కొత్త పేరు పెట్టారు. ఇకపై పాత పార్లమెంటు బిల్డింగ్ను సంవిధాన్ సదన్.. (రాజ్యాంగ భవన్)గా పిలువాలని చెప్పారు.

బ్రిటిష్ ఆర్కిటెక్టులైన సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్డ్ బేకర్ పాత పార్లమెంటు భవనానికి రూపకల్పన చేశారు. 1927లో బిల్డింగ్ నిర్మాణం పూర్తైంది. 96ఏండ్లుగా అక్కడే పార్లమెంటు ఉభయసభలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి అవసరాల దృష్ట్యా ఆ భవనం సరిపోకపోవడంతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు.

పార్లమెంటు కొత్త భవనంలోకి షిఫ్ట్ అయిన తర్వాత పాత బిల్డింగును కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ ఉండదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటరీ కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. బిల్డింగ్ లో కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నారన్న వార్తలు సైతం వస్తున్నాయి. 


Tags:    

Similar News