(CM Kejriwal) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్న ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఈ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి సరైన సాక్షాలను అందించాలని నోటీసులలో తెలిపారు.
అయితే, కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఈ నోటీసులను తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా కేజ్రీవాల్ కే నోటీసులు అందించాలని పోలీసులు వేచి చూస్తున్నట్లు సమాచారం. ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ మంత్రి అతిశీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా మంత్రి ఇంట్లో లేకపోవడంతో వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కొక్కరికీ రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఇటీవల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన విమర్శించారు. దీనిపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలకు మొత్తం అబద్దమని, ఈ ఆరోపణలకు సంబంధించి నిజనిజాలు తేల్చాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను కలిసారు.
నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం, విచారణ నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతకడం కేజ్రీవాల్ కు అలవాటైందని ఆరోపించారు సచ్ దేవా. వీరేంద్ర సచ్ దేవా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలను అందించాలని సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు.