సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపిన పోలీసులు.. ఆ తర్వాత..

Update: 2023-08-22 15:00 GMT

అంబులెన్స్.. ప్రజల ప్రాణాలు కాపాడే ఆపద్భందువు. రోడ్డుపై అంబులెన్స్ వస్తుందంటే అందరు దానికి దారి ఇస్తారు. ట్రాఫిక్ను సైతం ఆపేసి అంబులెన్స్కు దారి ఇచ్చిన ఘటనలెన్నో. అంబులెన్స్ వస్తుందంటే ఒక్కోసారి వీవీఐపీల వాహనాలను కూడా ఆపేస్తారు. కానీ ఓ చోట సీఎం కాన్వాయ్ వస్తుందని అంబులెన్స్ను ఆపేశారు. ఈ ఘటన బీహార్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

పట్నాలో పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి సీఎం కాన్వాయ్ కు దారిచ్చారు పోలీసులు. రోగి పరిస్థితి సీరియస్ గా ఉందని... అంబులెన్స్ కు దారివ్వాలని కుటుంబసభ్యులు కోరినా పోలీసులు వినలేదు. సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు అంబులెన్స్ ను నిలిపేశారు. ఈ ఘటనను డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. వీడియోలో ఆ రోగి కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి ప్రాణాలతో పోరాడుతూ ఉండగా.. కుటుంబ సభ్యులు ఏడుస్తున్నా.. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ కనీస మానవత్వం ప్రదర్శించలేదని మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై అటు పోలీసులు, ఇటు సీఎం నితీష్ ఇంతవరకు స్పందించలేదు.

Tags:    

Similar News