Artificial Fish Meat : ఇక ల్యాబ్‌లో చేపల మాంసం తయారీ

Update: 2024-01-30 02:00 GMT

చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేప మాంసం తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అటువంటి చేప మాంసం కావాలంటే చేపల మార్కెట్‌కు వెళ్లి తీసుకోవాల్సిందే. అయితే ఇకపై ఆ చేపల మాంసాన్ని ల్యాబ్‌లల్లో తయారు చేయనున్నారు. భారత్‌లో తొలిసారిగా చేపల మాంసాన్ని ల్యాబ్‌లల్లో చేసేందుకు పరిశోధకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు చేశారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తొలిసారిగా ల్యాబ్‌లో చేప మాంసాన్ని తయారు చేయనుంది.

చేపల నుంచి వేరు చేసిన కణాలను అభివృద్ధి చేసి చేప మాంసాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో కృత్రిమంగా చేప మాంసాన్ని పరిశోధకులు తయారు చేయనున్నారు. ప్రయోగంలో భాగంగా ముందుగా కింగ్ ఫిష్, చందువాయి చేప, సీర్‌ఫిష్ చేప మాంసాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అతిపెద్ద ప్రాజెక్ట్‌ను పబ్లిక్, ప్రైవేట్ యాజమాన్యాల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు.

కృత్రిమ చేపల మాంసాన్ని తయారు చేసేందుకు 'నీట్ మీట్ బయోటిక్' అనే సంస్థ కూడా చేతులు కలపనుంది. సీఎంఎఫ్ఆర్ఐ, నీట్ మీట్ బయోటిక్ రెండు సంస్థలు ఇప్పటికే ఓ ఒప్పందం చేసుకున్నాయి. చేపల కణాల ద్వారా మాంసాన్ని తయారు చేసేందుకు 'సెల్ కల్చర్ లేబొరేటరీ'ని ఏర్పాటు చేసి అందులో చేపల మాంసాన్ని పరిశోధకులు తయారు చేయనున్నారు. ఈ ఆర్టిఫిషియల్ చేప మాంసాన్ని రాబోయే రోజుల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. సముద్ర జీవుల సంరక్షణ కోసం ఇలా ల్యాబ్‌లల్లో చేపల మాంసాన్ని తయారు చేసేందుకు ఈ సంస్థలు నడుంబిగించాయి. ఈ రకంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలమని, సీ ఫుడ్‌కు పెరుగుతోన్న గిరాకీకి అనుగుణంగా ఈ కృత్రిమ చేపల మాంసాన్ని సరఫరా చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు.


Tags:    

Similar News