Droupadi Murmu : మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

Byline :  Kiran
Update: 2024-02-07 09:25 GMT

దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము మెట్రోలో ప్రయాణించారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలులో కొంచెం దూరం వెళ్లారు. రాష్ట్రపతిని ట్రైన్ లో చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్ ను వదిలి సామాన్యురాలిగా మెట్రోలో ప్రయాణించడం చూసి అవాక్కయ్యారు.

మెట్రో జర్నీలో ముర్ము కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. మెట్రో రైళ్లలో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రపతి వెంట ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ వికాస్‌ కుమార్‌ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెట్రో జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె నిరాడంబర జీవితానికి ఇది నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొఘల్‌ గార్డెన్స్‌తో పాటు రాష్ట్రపతి భవన్‌లోని పార్కులను సామాన్యులు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్‌ ఉద్యాన్‌-2024 ’ను ఇటీవల ప్రారంభించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వీటి సందర్శనకు వెళ్లే వారి కోసం ఢిల్లీ మెట్రో ఫ్రీ సర్వీసులు ప్రారంభించింది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ఫోర్త్ గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లొచ్చని ప్రకటించింది.

Tags:    

Similar News