సామాన్యుడు సన్న బియ్యం కొనలేని పరిస్థితి దాపురించింది. దేశ వ్యాప్తంగా సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.. గత సంవత్సరంతో పోలిస్తే 26 శాతం వరకు బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గి, దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్‌ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. నిరుడు క్వింటాలు రూ. 4,500 నుంచి రూ. 5 వేల మధ్య లభించగా ఇప్పుడు ఏకంగా రూ. 6,200 వరకు పెరిగింది. ఇందులో పాతబియ్యం అయితే రూ.7,500 వరకు పలుకుతున్నది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై ఆంక్షలు విధించింది. మొదట బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ తర్వాత పూర్తిగా ఆంక్షలు వేసింది. రాయితీ కింద రూ.25 కే కిలో బియ్యాన్ని భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను ప్రజలకు భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట రాయితీ ధరలకే కేంద్రం ఇప్పటికే అందిస్తోంది. ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ రైస్ పేరిట బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే అందుకోసం నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -నాఫెడ్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ - ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా రూ.25 కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.