MODI : ప్రచారానికి ఫినిషింగ్ టచ్.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకే ప్రచార పర్వానికి తెరపడబోతోంది. ఈ క్రమంలో ఆఖరి సమయంలో ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఇక బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ హైదరాబాద్ సిటీలో మెగా రోడ్ షో చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకూ 2.5 కిలోమీటర్ల మేర రోడ్‌షో చేస్తూ నగర వాసులను ఉత్సాహ పరిచారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ మీదుగా.. కాచిగూడ చేరుకున్నాక అక్కడ వీర సావార్కర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఇక ప్రధాని రోడ్‌షోకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్డు పొడవునా బారులు తీరి జేజేలు పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తున్నారు.
గత రెండ్రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ.. తన ప్రసంగంతో ఓటర్లలో జోష్ నింపుతున్నారు. ఈరోజు మహాబూబాబాద్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో తెలుగు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని తెలుగు ప్రసంగంతో స్టార్ట్ చేశారు. నా కుటుంబ సభ్యులారా అంటూ.. అధికారంలోకి వస్తే తెలంగాణ తొలి బీజేపీ సీఎం.. బీసీకి చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు. బీజేపీ శక్తి గురించి కేసీఆర్‌కు తెలుసని, అందుకే బీజేపీతో దోస్తి చేసేందుకు ప్రయత్నం చేశారని, ఒకసారి ఢిల్లీకి కూడా కేసీఆర్ వచ్చారని తెలిపారు. కేసీఆర్ తనతో ప్రాధేయపడ్డారని, కానీ బీజేపీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలుచుకోలేదని తెలిపారు. ఎన్‌డీఏలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారని వెల్లడించారు. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌ను దగ్గరకు రానివ్వదని, ఇది మోడీ గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని తెలుగులో మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఐదు వేల మందితో ప్రధాని మోదీకి బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రధాని మోదీ ర్యాలీలో గ్రేటర్ హైదరాబాద్ లోని 24 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.