ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభమయ్యే బాల రాముని ప్రాణ ప్రతిష్ఠలో ఆయన పాల్గొననున్నారు. 12.29 నిమిషాలకు మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ జరగనుంది. 12.55 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత 1.15కు అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో అయోధ్యకు సంబంధించి కొన్ని ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాలోని శివాలయాన్ని ప్రధాని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఈ నెల 11నుంచే ప్రత్యేక అనుష్ఠానాన్ని మోదీ అనుసరించారు. 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన చేపట్టారు. అదేవిధంగా దేశంలోని పలు ఆలయాలను సందర్శించారు. రాముని ప్రాణప్రతిష్ఠను కనులారా వీక్షించే అవకాశం రావడం తన అదృష్టమని గతంలోనే చెప్పారు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయని అన్నారు.