ప్రధాని పాలమూరు పర్యటన..కమళనాథుల సన్నాహాలు

Byline :  Aruna
Update: 2023-09-23 05:26 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పార్టీల హడావుడి ఊపందుకుంది. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరిట ఆయా జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో తమ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. అంతే కాదు ఇటీవల ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంలోనూ ఎన్నికలకు కేసీఆర్ శంఖారావం పూరించినట్లు తెలుస్తోంది. ఇటు జాతీయ పార్టీ బీజేపీ కూడా తన బలాన్ని తెలంగాణలో పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్టుగా ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్టు సమాచారం.

ప్రధాని మోదీ అక్టోబర్ 2వ తారీఖున పాలమూరులో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ టూర్‎కు సంబంధించిన సమాచారం బీజేపీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలకు చేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దక్కరపడుతున్న నేపథ్యంలో మోదీ పాలమూరు నుండి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మోదీ పాలమూరు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పాలమూరు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం జరగనుంది.




Tags:    

Similar News