PM Narendra Modi: రేపు ఏపీకి ప్రధాని మోదీ రాక - పూర్తి షెడ్యూల్ ఇదే

Byline :  Veerendra Prasad
Update: 2024-01-15 06:44 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(ఈ నెల 16వ తేదీన) ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. ఇక్కడి కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఎక్స్‌– రే, బ్యాగేజ్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్‌ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్‌ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్‌ ఫంక్షన్‌లో ‘ఫ్లోరా ఆఫ్‌ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

ఈ పర్యటనలో ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా రానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ లేపాక్షిలో పర్యటించారు. నంది విగ్రహం సమీపంలో 3 హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. వీరభద్ర స్వామి ఆలయాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఏపీ టూరిజం కార్యాలయంలో అధికారులతో సమావేశమై, దిశా నిర్దేశం చేశారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు.




Tags:    

Similar News