చట్టాన్ని తన పని చేయనివ్వండి.. రెజ్లర్లతో భేటీలో అమిత్ షా..

Update: 2023-06-05 05:51 GMT

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజర్లు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ ్య్యారు. శనివారం రాత్రి వారు హోంమంత్రితో సమావేశమవగా ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. బ్రిజ్ భూషణ్ పై ఛార్జ్ షీటు దాఖలయ్యేలా చూడాలని రెజ్లర్లు అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.

చట్టం అందరికీ సమానం

శనివారం రాత్రి 11గంటల సమయంలో రెజ్లర్లు బజ్ రంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్ తదితరులు కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. వారు దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సమావేశమైనట్లు సమాచారం. బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. రెజ్లర్ల డిమాండ్ పై స్పందించిన మంత్రి చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాన్ని తన పని తాను చేయనివ్వండని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హోం మంత్రి అమిత్ షాతో భేటీ జరిగిన విషయాన్ని బజ్ రంగ్ ఫునియా ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు చెప్పలేనని అన్నారు.

ముగిసిన గడువు

ఇదిలా ఉంటే బ్రిజ్ భూషణ్ పై వెంటనే చర్యలు తీసుకోకపోతే తమ పతకాలను గంగానదిలో విసిరేస్తామన్న రెజ్లర్లు రైతు సంఘం నేత నరేష్ టికాయత్ సూచనతో వెనక్కి తగ్గారు. కేంద్రానికి ఐదు రోజుల గడువు ఇచ్చారు. అది శనివారంతో ముగిసింది. ఈ క్రమంలో రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన భారతీయ కిసాన్ యూనియస్ జూన్ 9లోగా బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది.

రెండు ఎఫ్ఐఆర్లు

బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు నమోదుచేశారు. వాటిలో ఒకటి ఆరుగురు మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. మరొకటి మైనర్ రెజ్లర్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా బుక్ చేశారు. అయితే బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి రుజువుచేసినా ఉరేసుకుంటానని ప్రకటించారు. నార్కో టెస్టుకు సైతం సిద్ధమని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News