Qatar : మరణ శిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల విడుదల

Update: 2024-02-12 03:08 GMT

గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్‌లో అరెస్టయిన 8 మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరి విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌’ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొంది.




 


సబ్‌-మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారని.. రహస్యాలను ఇజ్రాయేల్ సహా ఇతర దేశాలకు చేరవేశారనే ఆరోపణలపై భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం 2022 అక్టోబరులో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వీరు దాదాపు 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఎనిమిది మందికి అక్కడి కోర్టు గతేడాది అక్టోబరు మరణశిక్ష విధించింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఖతార్‌లో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత నేవీ అధికారులలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రగేష్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ ఏపీలోని విశాఖ వాసి.




Tags:    

Similar News