కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు రంగం సిద్ధమైంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్ర మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడి ప్రభుత్వ సూచనలతో కాంగ్రెస్ ప్రారంభవేదికను మార్చింది. ఇంఫాల్కు బదులుగా తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 14న రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. అంతకుముందు యాత్రకు అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. మణిపూర్ లో తాజాగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అనుమతిని నిరాకరించింది. అయితే అదేరోజు రాత్రి యాత్రకు పర్మిషన్ ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాహుల్ యాత్రకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. కొన్ని షరతులు విధించింది. ప్రారంభవేదికను మార్చాలని సూచించింది. యాత్రలో పాల్గొనే సంఖ్యపైనా ఆంక్షలు విధించింది. 1000 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దని సూచించింది. జనవరి 14న ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 30న ముగియనుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 66 రోజులపాటు సుమారు 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్సభ స్థానాలను కవర్ చేసేలా యాత్ర జరగనుంది.
రాహుల్ యాత్ర మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా సాగుతుంది. భారత్ జోడో యాత్ర పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం బస్సుల్లో కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో మాత్రం పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గతంలో రాహుల్ గాంధీ.. 2022లో రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు.