రాహుల్ గాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత.. నోటిఫికేషన్‌ జారీ

లోక్‌సభలో అడుగుపెట్టనున్న రాహుల్;

By :  Lenin
Update: 2023-08-07 05:31 GMT


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. ‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన లాయర్, కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ స్పందిస్తూ.. రాహుల్ ఈ వర్షాకాల సమావేశాల్లోనే సభకు హాజరవుతారని ప్రకటించారు.




 

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నాటక వెళ్లిన రాహుల్ గాంధీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మే నెలలో రాహుల్ కు ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ జిల్లా కోర్టును, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రింకోర్టు.. ఈ నెల 4న స్టే ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అందినప్పటికీ వాటిని లోక్ సభ సచివాలయం అందుకోవడానికి శనివారం అందుబాటులో లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆఫీసులో వాటిని సమర్పించారు. సుప్రీం ఆదేశాల మేరకు సోమవారం లోక్ సభ రాహుల్ ను తిరిగి ఎంపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి ఎంపీ అయిన రాహుల్ .. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ పాల్గొనేందుకు అవకాశం లభించింది.

Rahul Gandhi Is MP Again After Supreme Court Relief In Modi Surname Case

Rahul Gandhi , MP Rahul Gandhi , Supreme Court Relief , Modi Surname Case

Tags:    

Similar News