భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తన స్టైల్ మార్చేశారు. (Rahul Gandhi) ప్రస్తుతం పాదయాత్రలా తిరగకపోయినా..టైమ్ దొరికినప్పుడల్లా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెకానిక్, రైతులు, రైల్వే కూలీలను కలసుకున్న రాహుల్ ఈ సారి రంపం పట్టారు. వడ్రంగి పనివారిని కలిసి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఢిల్లీలో అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన కీర్తినగర్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడి వడ్రంగి పనివారిని కలిశారు. వారితో ముచ్చటించడంతో పాటు వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంపం పట్టి ఫర్నీచర్ తయారీలో తను కూడా ఓ చేయి వేశారు. దీనికి సంబంధించి రాహుల్ ట్వీట్ చేశారు.
‘‘ఇవాళ ఢిల్లీలోని కీర్తినగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్‌కి వెళ్లి కార్పెంటర్ సోదరులను కలిశాను. వారు హార్డ్ వర్కర్లే కాదు.. అద్భుతమైన కళాకారులు కూడా. అందాన్ని చెక్కడంలో వారు నిపుణులు. వారి నుంచి కొన్ని నైపుణ్యాలు తెలుసుకోవడంతో పాటు నేర్చుకోవడానికి ప్రయత్నించా’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు వారితో దిగిన ఫొటోలను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.