కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ (ఫిబ్రవరి 8) ఒడిశాలో ముగిసి చత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత.. రాహుల్ తొలిసారి చత్తీస్ ఘడ్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో మరోసారి యాత్రకు బ్రేక్ పడింది. అత్యవసర పరిస్థితుల వల్ల రాహుల్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. ఢిల్లీకి వెళ్లారు. దీంతో రెండు రోజుల పాటు యాత్రకు విరామం ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర 2024 జనవరి 14న మణిపూర్ లోని తౌబాల్ నుంచి ప్రారంభమయింది. ఈ యాత్ర 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లు, 110 జిల్లాల గుండా సాగుతుంది. ఇది 100 లోక్ సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాలను కవర్ చేయనుంది. మార్చి 20న ముంబైలో రాహుల్ యాత్ర ముగుస్తుంది. కాగా కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు 3వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ కాలినడకన.. జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు.