Rahul Gandhi : బీహార్కు వెళ్లనున్న రాహుల్..సర్వత్రా ఆసక్తి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో అడుగు పెట్టబోతున్నారు. రాహుల్ చేస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, డీఎస్ ఆధ్వర్యంలోని మహఘట్‌బంధన్ కూటమి నుంచి సీఎం నితీశ్ కుమార్ బయటికి వచ్చారు. వీడిన బీజేపీతోనే మరోసారి చేతులుకలిపిన ఆయన బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన రాహుల్.. ఆ తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. కిషాన్‌గంజ్ మీదుగా జోడో యాత్ర బీహార్‌లోకి ప్రవేశించనుంది. కిషాన్ గంజ్ లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. అంతేగాక ప్రస్తుతం ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారు, ఏం మాట్లాడుతారు అనే విషయంపై చర్చ నడుస్తున్నది.