రైలు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే రైల్ ట్రాఫిక్ చార్ట్ ఇదే..

Update: 2023-06-03 13:14 GMT

ఒడిశా రైలు ప్రమాదం వందల కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280మంది మృతిచెందగా.. దాదాపు 1000 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక చెబుతోంది. తాజాగా ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలిపే రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌ వెలుగులోకి వచ్చింది.

రైలు ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన లేఅవుట్‌ను రైల్వే ట్రాఫిక్‌ అధికారులు విడుదల చేశారు. ఈ లేఅవుట్ను ఓసారి గమనిస్తే.. మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో మిడిల్ లైన్‌ ‘‘యూపీ మెయిన్‌’’ లైన్. ఇందులోనే షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దానికి కుడివైపున ఉన్న లైన్‌ ‘‘డీఎన్‌ మెయిన్‌’’. బెంగళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ లైన్‌లోనే వెళ్లింది.

పొరపాటున లూప్ లైన్లోకి..

యూపీ మెయిన్‌లైన్‌లో వెళ్తున్న కోరమాండల్‌ పొరపాటున కామన్‌ లూప్‌లోకి వెళ్లింది. దీంతో అప్పటికే ఆ లైన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలును బలంగా ఢీ కొట్టింది. దీంతో కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డీఎన్‌ మెయిన్‌ లైన్‌లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో ఆ లైన్లో వెళ్తున్న బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీ కొట్టడంతో పెను ప్రమాదం జరిగింది.

మార్గం సుగమం చేసేందుకు..

మెయిన్‌లైన్‌లో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు మార్గం సుగమం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లను ట్రాఫిక్‌ అధికారులు లూప్‌లైన్‌లోకి పంపిస్తారు. కొంత సమయం తర్వాత సిగ్నల్‌ క్లియరెన్స్‌ను బట్టి మళ్లీ వాటిని మెయిన్‌లైన్‌లోకి అనుమతిస్తారు. అయితే ఇక్కడ సిగ్నలింగ్లో లోపం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సిగ్నలింగ్ లోపంతో మెయిన్ లైన్లోకి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్‌ లైన్‌లోకి వెళ్లి గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టినట్లు ప్రాథమిక నివేదికలో ఉంది. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోంది. దీంతో లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా వేగాన్ని కంట్రోల్ చేయలేపోయినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News