ఒడిశా రైళ్ల ప్రమాదం విచారణలో ట్విస్ట్..

Update: 2023-06-21 05:29 GMT

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందగా.. దాదాపు 1200మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలను నిగ్గుతేల్చే పనిలో సీబీఐ నిమగ్నమైంది. ఈ కేసులో ఇప్పటికే రైల్వే స్టేషన్కు సీల్ వేసిన సీబీఐ.. తాజాగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేశారు. అంతకుముందు అతడిని రహస్య ప్రదేశంలో విచారించారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో జోక్యం చేసుకోవడం వల్లే రైలు ప్రమాదం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ జేఈ కదలికలపై నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే ఇంటికి సీల్ వేసింది. రైల్వేలో జూనియర్‌ సిగ్నల్‌ ఇంజినీర్‌ బాధ్యత చాలా కీలకమైంది. పాయింట్‌ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌, సిగ్నల్స్‌ సహా సిగ్నలింగ్‌ పరికరాల ఇన్‌స్టలేషన్‌ విధులను జేఈ నిర్వహిస్తారు. రైళ్లు సాఫీగా, సురక్షితంగా వెళ్లడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి విధుల్లో ఉన్న జేఈ అమీర్‌ఖాన్‌ ఇంటిని సీబీఐ సీల్‌ చేయడం గమనార్హం.

ఈ రైలు ప్రమాదంలో బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్ మాస్టర్‌తో సహా ఐదుగురు రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉందన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే స్టేషన్ మాస్టర్ ఇంటిని సీబీఐ పరిశీలించింది. ‘‘ సిగ్నల్ వ్యవస్థలో ఏదైనా చిన్న సమస్య ఎదురైతే రెడ్ సిగ్నల్ పడుతుందన్నారు. కానీ బాలాసోర్ రైలు ప్రమాద సమయంలో గ్రీన్ సిగ్నల్ పడటం వెనుక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చని’’ అధికారులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News