Indian Railways: రైలు ప్రమాదాల బాధితులకు ఎక్స్‌గ్రేషియా 10 రెట్లు పెంపు..

Update: 2023-09-21 03:11 GMT

రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 18న ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ రోజు నుంచే పరిహారం పెంపు అమల్లోకి వచ్చింది. 2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. రైల్వే బోర్డు తాజా నిర్ణయం ప్రకారం రైలు ప్రమాదాలతో పాటు కాపలాదారులున్న లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకూ ఇది వర్తిస్తుంది. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25,000 బదులు రూ.2.5 లక్షలు; స్వల్పగాయాలైనవారికి రూ.5,000 బదులు రూ.50,000 ఇస్తారు. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు.

ఇక రైలు ప్రమాదాల బాధితులు.. 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే రోజుకు రూ.3,000 వంతున ప్రతీ 10 రోజులకోసారి అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. అవాంఛిత ఘటనల్లోనైతే ఈ మొత్తం రూ.1,500గా ఉంటుంది. ఇలా 6 నెలలవరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ.750 చొప్పున గరిష్ఠంగా మరో 5 నెలలపాటు చెల్లిస్తారు. అయితే కాపలాదారుల్లేని లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు, రైల్వే నిబంధనలను అతిక్రమించినవారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ (ఓహెచ్‌ఈ) వల్ల విద్యుదాఘాతానికి గురైనవారికి మాత్రం ఎక్స్‌గ్రేషియా లభించబోదని రైల్వేబోర్డు స్పష్టంచేసింది.



Tags:    

Similar News