రాజస్థాన్లో ముగిసిన ప్రచారం.. 25న ఎన్నిక..

By :  Kiran
Update: 2023-11-23 15:15 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్లకు సర్వం సిద్ధమైంది. దాదాపు నెలన్నరగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో రాజకీయ పార్టీల రోడ్ షోలు, సభలు సమావేశాలు బంద్ అయ్యాయి. గత ఎన్నికల సమయంలో సాయంత్రం 5గంటల వరకే ప్రచారాన్ని అనుమతించగా.. ఈసారి అదనంగా ఒక గంట పెంచారు. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది.

ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా.. ప్రస్తుతం 199 స్థానాలకు 25న పోలింగ్‌ జరగనుంది. కరణ్‌పుర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కనూర్‌ ఆకస్మిక మరణంతో అక్కడ పోలింగ్‌ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.25కోట్ల మంది ఓటర్లు 1,900 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని మోడీతో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం అశోక్‌ గహ్లోత్‌తో పాటు ఇతర నేతలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరం ప్రచారం చేశారు.

రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధికారులు రూ.682 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్‌ చేశారు. గత ఎన్నికల సమయంలో 65 రోజులతో పోలిస్తే ఈసారి 42రోజుల్లోనే భారీగా నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రాజస్థాన్‌లో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.




Tags:    

Similar News