మహిళలకు భద్రత లేదన్న మంత్రిని తప్పించిన కాంగ్రెస్

Update: 2023-07-22 03:35 GMT

మహిళల భద్రత.. దేశవ్యాప్తంగా ఈ అంశంపై బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తూనే ఉంటుంది. మణిపూర్ మహిళల అమానుష ఘటన తర్వాత ప్రధాని రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీ పాలనలో మహిళల భద్రత ఆందోళనలో పడిందని ఆరోపించింది. ఈ క్రమంలో ఆ పార్టీకి సొంత మంత్రే ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై వివక్ష పెరుగుతుందంటూ వ్యాఖ్యానించి వేటుకు గురయ్యాడు.

రాజస్థాన్​ అసెంబ్లీలో కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై చర్చ జరిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మణిపుర్​ అమానుష ఘటనను నిరసిస్తూ ప్లకార్డ్​లు ప్రదర్శించారు. ​ఈ క్రమంలో మంత్రి రాజేంద్ర రాజస్థాన్లో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీలోనే అన్నారు. రాష్ట్రంలో మహిళలపై వివక్ష రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో మనం విఫలం అయ్యాం. దీన్ని మనందరం అంగీకరించాలి. మణిపుర్ ఘటనను లేవనెత్తే బదులు.. ముందు మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని రాజేంద్ర అన్నారు. మంత్రి అయివుండి ప్రభుత్వాన్నే ప్రశ్నించడంపై సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి రాజేంద్రను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నిప్పులు చెరిగింది. సీఎం గెహ్లాట్కు నిజాన్ని ఒప్పుకునే దైర్యం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. అసెంబ్లీలో రాజేంద్ర నిజాన్ని మాట్లాడారు కాబట్టే ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ ట్వీట్​ చేశారు. మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందనే విషయం రాజేంద్ర వ్యాఖ్యలతో స్పష్టమైందని విమర్శించారు.

Tags:    

Similar News