సీఎం కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్

By :  Kiran
Update: 2023-10-19 11:23 GMT

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధమని, కానీ ఆ హోదా తనను వదులుకునేందుకు రెడీగా లేదని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ నుంచి పోటీ ఎదురవుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది.

నాల్గోసారి కూడా తాను సీఎం పీఠంపై కూర్చోవాలని ఓ మహిళా కార్యకర్త చెప్పిన మాటల్ని గెహ్లాట్ గుర్తు చేశారు. సీఎం పదవి వదలుకోవాలని తనకు ఉందని, కానీ ఆ కుర్చీ తనను వదలిపెట్టడంలేదని, భవిష్యత్తులోనూ వదలకపోవచ్చని తాను సదరు మహిళతో చెప్పానని అన్నారు. గెహ్లాట్ వ్యాఖ్యలు సరదాగా చెప్పినట్లే అనిపించినా.. రాజస్థాన్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తనదేనని పైలెట్కు పరోక్ష సంకేతాలిచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి రాజస్థాన్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. 2020లో ఓ దశలో రెండు వర్గాలుగా విడిపోవడంతో ప్రభుత్వ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. సరైన సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టడంతో సమస్య సద్దుమణిగింది.




Tags:    

Similar News