యోగి కాళ్లు మొక్కిన రజనీకాంత్.. ట్రోలింగ్‌పై ఫ్యాన్స్ సీరియస్

Update: 2023-08-20 09:00 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు ఉండరు. సౌత్ ఇండియాలో అగ్ర హీరో. నార్త్ ఇండియలో కూడా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సౌత్ హీరో. ఏ హీరో అభిమాని అయినా సరే రజినీకాంత్ కు అభిమానిగానే ఉంటారు. రీసెంట్ గా ఆయనకు జైలర్ మూవీతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆయన పేరు మార్మోగుతోంది. అలాంటి రజినీకాంత్ తాజాగా చేసిన పని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. శనివారం ఆయన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడానికి వెళ్లారు. అయితే యోగి ఎదురు కాగానే రజినీకాంత్ వెళ్లి ఆయన కాళ్లు మొక్కాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. యోగి వయసు 51 ఏళ్లు. రజినీకాంత్ వయసు 72 ఏళ్లు. తనకంటే ఇరవై ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం ఏంటని అంతా భగ్గుమంటున్నారు. ఇప్పుడిది పెద్ద వివాదంగా మారింది.

అది రజనీపై ట్రోల్స్ కి కారణమవుతుంది. రజినీకాంత్ తో పోలిస్తే యోగి ఆదిత్యనాథ్ కు పెద్దగా పేరు లేదు. అలాంటిది తమిళ జనాలు ఎంతో ఆరాధించే రజినీకాంత్ వెళ్లి యోగి కాళ్లు మొక్కడం అందరికీ షాక్ తగిలిస్తోంది. అయితే కొందరు మాత్రం రజినీకాంత్ ను సపోర్ట్ చేస్తున్నారు. యోగి ఒక సన్యాసి. కాబట్టి ఆయన కాళ్లు మొక్కడంలో తప్పులేదు. ఆధ్యాత్మిక కోణంలోనే రజినీకాంత్ యోగి కాళ్లు మొక్కారు. అంతే తప్ప అందులో పెద్ద రాద్దాంతం ఏమీ లేదని చెబుతున్నారు. రజనీకాంత్ గురించి తెలియని మూర్ఖులే ఈ విధంగా ఆయన గురించి ట్రోల్ చేస్తారని మండిపడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అనో, లేదంటే బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అనో రజనీకాంత్ ఆయన కాళ్లకు మొక్కలేదని.. ఆయన ఒక సన్యాసి కాబట్టి మొక్కారని వివరణ ఇస్తున్నారు. హిందూ ధర్మాన్ని పవిత్రంగా భావించే, గౌరవించే వ్యక్తిగా ఒక యోగి కాళ్లకు రజనీకాంత్ నమస్కరించారని చెబుతున్నారు. గతంలోనూ తన కన్నా వయసులో చిన్నవాడైన ఒక సన్యాసి కాళ్లకు రజనీకాంత్ మొక్కారని.. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఒక సన్యాసి కాళ్లకు రజనీకాంత్ నమస్కరించిన వీడియోను కూడా షేర్ చేస్తున్నారు.

గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రజనీకాంత్ పలుమార్లు కలిశారు. కానీ, ఎప్పుడూ నరేంద్ర మోదీ కాళ్లకు రజనీకాంత్ నమస్కరించలేదు. ఒకవేళ ఆయన బీజేపీకి తలవంచి ఉంటే.. మోదీ కాళ్లకు మొక్కేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం సన్యాసి అనే గౌరవంతోనే యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు రజనీకాంత్ నమస్కరించారని తేల్చి చెబుతున్నారు. అలాగే, దివ్యాంగుడైన ఒక అభిమాని కాళ్లను సైతం గతంలో రజనీకాంత్ తాకారు. ఆ దివ్యాంగుడు రజనీకాంత్ కన్నా 55 ఏళ్లు చిన్నవాడని.. మరి ఆయన ఎందుకు తాకారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News