రాఖీ రోజు అన్నకు మర్చిపోలేని బహుమతి

Byline :  Aruna
Update: 2023-08-30 13:17 GMT

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నం ‘రక్షా’బంధన్‌! సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరికీ రాఖీ ఓ భావోద్వేగం. ఎంత బిజీగా ఉన్నా అక్కాచెల్లెల్లు, తమ అన్నా తమ్ముళ్లకు రాఖీలను కట్టి కలకాలం వారి బంధం ఇలాగే నిలవాలని కోరుకుంటారు. నిజానికి రాఖీ పండుగ రోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడితే సోదరులు బహుమతులు ఇస్తుంటారు. కానీ ఈ సోదరి మాత్రం అందరి కంటే భిన్నం. తన సోదరుడికి ఈ రాఖీ పండుగ రోజు ప్రపంచంలో ఏ సోదరి ఇవ్వనటువంటి అత్యంత విలువైన బహుమతిని ఇచ్చింది. కాదు కాదు తన అన్నకు ఓ జీవితాన్ని ప్రసాదించింది.

చత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌‎లో ఉంటున్న ఓంప్రకాష్ ధంగర్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతని రెండు కిడ్నీలు దాదాపు 90 శాతం పాడవటంతో డయాలసిస్ చేయాల్సిన సీరియస్ కండీషన్‎లో ఉన్నారు. దీంతో అతని సర్జరీ చేయించాలనుకున్నారు కుటుంబసభ్యులు. డాక్టర్లు దాతలు కావాలని చెప్పడంతో చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో తిక్రపారాలో ఉంటున్న ఓం‎ప్రకాష్ సోదరి షీలాబాయి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో సోదరుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ రాఖీకి కిడ్నీ దానం చేసి తన సోదరుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలనుకుంది.

ప్రస్తుతం డాక్టర్లు షీలాబాయికి సర్జరీ నిమిత్తం అన్ని టెస్టులు చేశారు. ఆమె కిడ్నీ తన సోదరుడికి మ్యాచ్‌ అవుతుందని తెలిపింది. దీంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా కిడ్నీ ట్రాన్స్‎ప్లాంటేషన్‎ను వెంటనే చేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్‌ 3వ తేదీన గుజరాత్‌లో ఓంప్రకాష్‎కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు అన్నీఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి వారం ముందు షీలాబాయి తన అన్నకు రాఖీ కట్టింది. తన సోదరుడు ఆయురారోగ్యాలతో జీవించాలనే కోరుకుంది. రాఖీకి ఇంతకంటే మంచి బహుమతి ఏమి ఇవ్వగలను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.  




Tags:    

Similar News