Ram Mandir first morning: భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. అయోధ్యలో తోపులాట

Byline :  Veerendra Prasad
Update: 2024-01-23 02:42 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం అయోధ్యలోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహాత్తర వేడుకకు ముఖ్యఅతిథులుగా తరలివచ్చిన ప్రముఖులు గర్భగుడిలో శ్రీ రాముడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. నిన్న మొత్తం ప్రాణ ప్రతిష్ట కు సంబంధించిన కార్యక్రమమే జరగ్గా నేటి నుంచి సాధారణ రామభక్తులకు శ్రీరాముడి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో.. రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో అయోధ్య గేటు బయట వేచి చూస్తున్న రామభక్తులు ఈ రోజు తెల్లవారుజామున గేట్లు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. . తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులకు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. దీంతో అయోధ్యకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

సాధారణ భక్తులంతా తొలి రోజే రామ్‌లల్లా దర్శించుకోవాలని పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. సాధారణ భక్తులకు నేటి (మంగళవారం) దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో ప్రముఖుల దర్శనాలు జరిగే అవకాశం ఉండటంతో సాధారణ భక్తులకు సెక్యూరిటీ వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయని.. త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసి రామ భక్తులకు ప్రశాంతమైన రామ దర్శనాన్ని అందిస్తామని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.

కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.

Tags:    

Similar News